: అఖిలేష్ సన్నిహితుడిని పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ... అక్కడి అధికార పార్టీ అయిన ఎస్పీలో అంతర్గత రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. పార్టీ రెండుగా నిట్టనిలువునా చీలిపోయింది. ఒక వర్గం ముఖ్యమంత్రి అఖిలేష్ కు సపోర్ట్ చేస్తుండగా... మరోవర్గం ములాయం సింగ్ ను, ఆయన సోదరుడు శివపాల్ యావవ్ ను సపోర్ట్ చేస్తోంది. ఈ క్రమంలో అఖిలేష్ కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ యుద్ధవీర్ సింగ్ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి ములాయం సింగ్ యాదవ్ సస్పెండ్ చేశారు. మరోవైపు, అఖిలేష్ ప్రభుత్వంపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖిలేష్ ప్రభుత్వం దారిలో పెట్టిందని, తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం గొప్ప విజయమని ములాయం కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారని కితాబిచ్చారు. అయితే, వచ్చే నెల 3వ తేదీ నుంచి అఖిలేష్ ప్రారంభించనున్న రథయాత్ర గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే సమయంలో, అఖిలేష్ ముఖ్య అనుచరుడిపై వేటు వేశారు.