: ఇమ్రాన్ ఖాన్ 'ముట్టడి' భయం నేపథ్యంలో.. ఉగ్రవాద గ్రూపులతో భేటీ అయిన పాక్ హోంమంత్రి
ఇస్లామాబాద్ ముట్టడికి ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చిన రోజు దగ్గర పడుతుండటంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ చేపట్టిన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భగ్నం చేయాలని షరీఫ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో, రెండు నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో ఆ దేశ హోంమంత్రి నిసార్ అలీఖాన్ భేటీ అయ్యారు. ఇమ్రాన్ చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో ఈ గ్రూపులు కూడా పాల్గొంటాయేమోనన్న భయంతో, వాటిని బుజ్జగించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. నవంబర్ 2న ఇమ్రాన్ నిర్వహించబోయే ఇస్లామాబాద్ ముట్టడి కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకుంటామని డిఫ్షే పాకిస్థాన్ కౌన్సిల్ (డీపీసీ) అధినేత మౌలానా సమీవుల్ హక్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు, ఇస్లాం మతంలోని విభిన్న వర్గాలను షరీఫ్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని ఆరోపించారు. తాలిబన్ గాడ్ ఫాదర్ గా సమీవుల్ పేరొందారు. దీంతో, షరీఫ్ సర్కారుకు వణుకు మొదలైంది. వెంటనే, సమీవుల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో హోంమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సమీవుల్ తో పాటు నిషేధిత హర్కతుల్ ముజాహిదీన్ స్థాపకుడు మౌలానా ఫజ్లర్ రెహమాన్ ఖలీల్, నిషేధిత అహ్లే సున్నత్ వాల్ జమాత్ కు చెందిన మౌలానా మహమ్మద్ అహ్మద్ లుథిన్విలు కూడా హాజరయ్యారు. ఇమ్రాన్ చేపట్టబోయే ఆందోళనలో పాల్గొనవద్దని ఈ సందర్భంగా వారిని పాక్ హోం మంత్రి కోరారట.