: హిల్లరీని ట్రంప్ అధిగమిస్తాడా?...రాయిటర్స్ సర్వేలో సంచలన ఫలితాలు


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదవ్వనున్నాయా? అంటే రాయిటర్స్ వార్తా సంస్థ అవుననే చెబుతోంది. అధ్యక్ష ఎన్నికలకు రెండు వారాల గడువు ఉండడానికి తోడు ఫైనల్ ప్రెసిడెన్షియల్ బిగ్ డిబేట్ ముగిసిన నేపథ్యంలో అంతా హిల్లరీదే విజయమనే భావనలో ఉన్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ తాను విజయం సాధించి, వైట్ హౌస్ లో ప్రవేశిస్తే అమలు చేస్తానంటూ 'ఫస్ట్ 100 డేస్' ప్రణాళికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ విజయానికి పూర్తిగా దారులు మూసుకుపోలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ చేసిన రిగ్గింగ్ ఆరోపణలు అమెరికన్లపై మంచి ప్రభావం చూపాయని రాయిటర్స్ అంటోంది. దీంతో ట్రంప్ గణనీయంగా ఆధిక్యం పెంచుకోగలిగారని, దీంతో ట్రంప్, క్లింటన్ మధ్య తేడా కేవలం 6.2 శాతం మాత్రమేనని, దానిని రెండు వారాల్లో అధిగమించడం ట్రంప్ కు పెద్ద విషయం కాదని రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుతం ట్రంప్ కు 41.9 శాతం మంది అమెరికన్లు మద్దతు పలుకుతుండగా, హిల్లరీకి 48.1 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. ట్రంప్ తన ఆధిక్యం 40 నుంచి 44 శాతానికి పెంచుకున్నారని రాయిటర్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో హిల్లరీ ఆధిప్యతానికి గండికొట్టి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలిపింది. కాగా, వికీలీక్స్ విడుదల చేసిన తాజా మెయిల్స్ హిల్లరీ ఆధిక్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నది రాజకీయపరిశీలకుల విశ్లేషణ. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది.

  • Loading...

More Telugu News