: పాఠ‌శాల‌ల్లో మద్యం తాగి బాటిళ్ల‌ను ప‌డేస్తున్నారు.. తీరు మార్చుకోవాలి: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు


మ‌న భ‌విష్య‌త్తు మ‌న చేతుల్లోనే ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కాకినాడ‌లో ప‌ర్య‌టిస్తోన్న ఆయ‌న స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్‌, దోమ‌ల‌పై దండ‌యాత్ర కార్యక్ర‌మాల్లో పాల్గొని, అక్క‌డ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. దేవుడు ఏ రూపంలో వున్నా మ‌నం పూజిస్తామ‌ని, దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల్లో ఉన్న దేవుడిని న‌మ్ముతామ‌ని అన్నారు. ఆ న‌మ్మ‌కంతోనే ముందుకు వెళ‌తామ‌ని వ్యాఖ్యానించారు. దేవాల‌యం లాంటి ఒక ప‌విత్ర‌మైన స్థలమే పాఠ‌శాల అని ఆయ‌న పేర్కొన్నారు. అలాంటి పాఠ‌శాల‌ల్లో ప‌లువురు వ్య‌క్తులు తాగి బాటిళ్ల‌ను ప‌డేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది విద్యార్థుల‌పై చెడు ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని చెప్పారు. ఈ తీరుని మార్చుకోవాల‌ని సూచించారు. సినిమాలు, స‌మాజంలోని వ్య‌క్తుల‌ను చూసి విద్యార్థులు ఆక‌ర్షితుల‌వుతారని, స‌మాజం బాగుప‌డాలంటే మంచి సంప్ర‌దాయంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. పాఠ‌శాల‌లు, ఆల‌యాల వ‌ద్ద ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని సూచించారు. చెట్లు మ‌న‌కి ఆరోగ్యాన్నిస్తాయని అన్నారు. ప‌రిశుభ్ర‌మైన ప‌రిస‌రాలు ఉంటే ఆరోగ్యం బాగుంటుందని అలాగే మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయని అన్నారు. దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ న‌డుం బిగించాల‌ని చెప్పారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌ని అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకి ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆర్థికస్థితి బాగోలేకపోయినా తాము ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తీసుకొచ్చామ‌ని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్ర‌ణాళిక‌లు తీసుకొచ్చిన‌ట్లు పేర్కొన్నారు. చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు ప‌రిక‌రాలు ఇస్తున్నామ‌ని చెప్పారు. కాపు సామాజిక వ‌ర్గానికి బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించామ‌ని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల‌తో పిల్ల‌లు ఎవ్వ‌రూ చ‌దువుకి దూరం కాకుండా ప్ర‌భుత్వం సాయాన్ని అందిస్తోంద‌ని చెప్పారు. పేద‌ల‌కు తాము ఉచిత వైద్య స‌దుపాయం అందిస్తున్న‌ట్లు చెప్పారు. దేశంలోనే పింఛ‌న్లు పెంచిన ఘ‌న‌త మ‌న రాష్ట్రానికే ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News