: వారం రోజుల్లో పాక్ ఆర్మీకి కొత్త చీఫ్... నమ్మకస్తుడిని నియమించుకునే పనిలో షరీఫ్
మరో వారం లేదా పది రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీకి కొత్త చీఫ్ వస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ సీనియర్ మంత్రి తారీఖ్ ఫజల్ చౌదరి వెల్లడించారు. ఈ నెల చివర్లో ప్రస్తుత చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో, కొత్త చీఫ్ గా బాధ్యతలను ఎవరికి కట్టబెట్టబోతున్నారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరిని నియమించాలన్న దానిపై ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదని... త్వరలోనే పేరును వెల్లడిస్తామని చౌదరి తెలిపారు. మరోవైపు, తనకంటే ముందు బాధ్యతలు చేపట్టిన జనరల్ అష్ఫక్ కయానీ తరహాలో రెండోసారి ఛీఫ్ గా కొనసాగాలన్న ఉద్దేశం తనకు లేదని ఇప్పటికే రహీల్ షరీఫ్ స్పష్టం చేశారు. భారత్ తో దిగజారిన సంబంధాలు, దేశంలో నెలకొన్న అంతర్గత సమస్యల నేపథ్యంలో ప్రధాని షరీఫ్ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, తనకు నమ్మకస్తుడైన వ్యక్తికి ఆర్మీ చీఫ్ బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనలో షరీఫ్ ఉన్నారని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్ చట్టాల ప్రకారం, ఆర్మీ చీఫ్ పదవీకాలం ముగిసిపోతే, కొత్త చీఫ్ ను నియమించే అధికారం కేవలం ప్రధానికే ఉంటుంది.