: అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ-మెయిల్స్‌పై వికీలీక్స్ గురి... ప్రైవేట్ ఈ-మెయిల్స్ బహిర్గతం.. కీలక విషయాలు వెల్లడి
ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్న ఎన్నో విషయాలని, ప్రపంచ నేతల బండారాన్ని బయటపెడుతూ అందరినీ ఉలిక్కిపడేలా చేసే వికీలీక్స్ ఈ సారి మళ్లీ పంజా విసిరింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై దృష్టి సారించింది. ఆయనకు సంబంధించిన ప్రైవేట్ ఈ- మెయిల్స్‌ని బహిర్గతం చేసింది. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్షపదవి కోసం డెమొక్రాట్ల తరఫున పోటీ పడుతోన్న హిల్లరీ క్లింటన్‌కు ఈ అంశం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఒబామాకు చెందిన ఏడు ఈ-మెయిల్స్‌ను వికీలీక్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసి మళ్లీ ఓ సారి ప్రపంచం దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. వాటిల్లో పలు కీలక విషయాలు వెల్లడించింది. సదరు ఈ-మెయిళ్లలో జి-20 సమావేశాలకు వెళ్లకూడదంటూ 2008 ఎన్నికల సందర్భంగా ఒబామా టీమ్‌లోని జాన్ పొడెస్టా పంపిన మెయిల్ సైతం ఉంది. ఆ ఏడాది నవంబర్ 4న దీనిని పొడెస్టా పంపినట్లు పేర్కొంది. అప్పట్లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై కీలక అంశాలను చర్చించేందుకు ఆ సదస్సును ఏర్పాటు చేశారు. ఒబామా ఎన్నికైన రోజు ఆయనను జార్జి డబ్ల్యూ బుష్ ఆ సదస్సుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొడెస్టా ఓ మెయిల్ పంపారు. అందులో మిమ్మల్ని జీ-20 సమావేశాలకు హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు బుష్ ఆహ్వానించవచ్చు అని ఉంది. ఈ అంశంపై ఒబామా అప్రమత్తంగా ఉండాలని పొడెస్టా సూచించారు. తాము ఒబామాకు ఇచ్చే సలహా ఒక్కటేనని, ఆ సమావేశాలకు ఒబామా హాజరుకాకూడదని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌లో సూచన ఉన్నట్లుగానే వాషింగ్టన్‌లో జరిగిన జి-20 సమావేశాలకు ఒబామా హాజరుకాలేదు. వికీలీక్స్‌కు లీకైన ఒబామా ఈ మెయిల్స్ వ్యవహారం పట్ల తమ ప్రత్యర్థి దేశం రష్యా జోక్యం ఉందేమోనని వైట్‌హౌజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ అధికార పార్టీ డెమొక్రాటిక్ ఈ-మెయిల్స్‌ను ఆ దేశం హ్యాక్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం పొడెస్టా ఆ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న హిల్లరీ ప్రచార బృందానికి సారధిగా వ్యవహరిస్తున్నారు. పొడెస్టాకు చెందిన సుమారు 23,000 ఈ-మెయిల్స్ అపహరణకు గురయ్యాయి. అందులో తమ అధ్యక్షుడు ఒబామాకు పంపినవే అధికంగా ఉన్నాయి.