: డీఆర్ఎస్ కు ఓకే చెప్పిన బీసీసీఐ.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో అమలు!
ఎంతో కాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్న డీఆర్ఎస్ (అంపైర్ నిర్ణయ సమీక్షా పధ్ధతి)కు ఎట్టకేలకు బీసీసీఐ ఓకే చెప్పింది. ఇంగ్లండ్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. తొలుత అనుకున్న డీఆర్ఎస్ విధానానికి పలు మార్పులు చేసిన తర్వాత, కొత్త పద్ధతిపై బీసీసీఐలో అంతర్గత చర్చ జరిగింది. అంతేకాదు, తాజాగా మెరుగు పరిచిన పద్ధతిని బీసీసీఐకి వీడియో ప్రదర్శన ద్వారా ఐసీసీ చూపింది. గతంలో బీసీసీఐ సూచించిన విధంగా హాక్ ఐ పద్ధతిలో ఐసీసీ పలు మార్పులు చేసింది. అందువల్లే డీఆర్ఎస్ కు ఓకే చెప్పినట్టు బీసీసీఐ తెలిపింది. అయితే, ఎల్బీడబ్ల్యూ విషయంలో బ్యాట్స్ మెన్ ప్యాడ్ కు ఎంతవరకు తాకిందనే విషయాన్ని ఇంగ్లండ్ తో జరిగే టెస్టుల సందర్భంగా నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించింది. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, బాల్ ట్రాకింగ్ సాంకేతికతలో అల్ట్రామోషన్ కెమెరాలను వినియోగిస్తున్నారు కాబట్టి... కచ్చితమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. డీఆర్ఎస్ ను గతంలో కెప్టెన్ ధోనీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీల రాకతో పరిస్థితిలో మార్పు వచ్చింది.