: విశాఖ ఏజెన్సీని ‘వణికిస్తున్న’ చలి.. లంబసింగిలో 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
దీపావళికి ముందే తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రవేశించింది. వారం పదిరోజుల క్రితమే ప్రారంభమైన చలి క్రమంగా పుంజుకుంటోంది. సాయంత్రం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజల వెన్నులో ‘వణుకు’ మొదలైంది. ఇక విశాఖ ఏజెన్సీని అయితే చలి గజగజలాడిస్తోంది. ఎండెక్కితే కానీ బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇక ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా పది డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలోని మిగతా ప్రాంతాలైన మోదకొండమ్మ పాదాల వద్ద 11, మినుములూరులో 12, చింతపల్లిలో 13, పాడేరులో 14, అరకులో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కార్తీక మాసానికి ముందే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో మున్ముందు పరిస్థితి చలి విజృంభించడం ఖాయమని చెబుతున్నారు.