: త్వరలో పంటచేనులో ‘బాహుబలి’ బియ్యం.. అభివృద్ధి చేసిన ఐజీకేవీ పరిశోధకులు
‘బాహుబలి’కి, బియ్యానికి లింకేంటన్న సందేహం వస్తే రావచ్చు కానీ ఈ బియ్యంలో ఉన్న పోషక విలువల గురించి తెలిస్తే మాత్రం పోలిక సరైనదేనని అంగీకరించక మానరు. ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ(ఐజీకేవీ) పరిశోధకులు ఈ ధాన్యాన్ని అభివృద్ధి చేశారు. ప్రొటీన్లు, జింక్ అధికంగా ఉండే ధాన్యం కోసం ఏడేళ్లుగా చేస్తున్న కృషి ఇన్నాళ్లకు ఫలించింది. పోషకాహార లోపంతో బాధపడే గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు ఈ బియ్యం వర ప్రదాయిని అయ్యే అవకాశం ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఐజీకేవీ ప్రొఫెసర్ డాక్టర్ గిరీశ్ చందల్ తెలిపారు. మాంసం తినని, పప్పులు కొనలేని ప్రజలకు ఈ బియ్యం ద్వారా మేలైన ప్రొటీన్లు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బియ్యం రకాల్లో పిండి పదార్థం అధికంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రొటీన్ మోతాదులు అయితే బహు స్వల్పం. అయితే తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం బియ్యంలో 10 శాతానికి పైగా ప్రొటీన్ ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకాలతో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. అలాగే జింక్ కూడా 30 పీపీఎం వరకు ఉంటుంది. అభివృద్ధి చేసిన ధాన్యం రకాన్ని ఆరు నెలల్లోగా రాష్ట్ర గుర్తింపు కమిటీకి పంపిస్తామని, వచ్చే ఏడాది నుంచి సాగుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉందని గిరీశ్ చందల్ వివరించారు.