: వాళ్లు బొగ్గు ఆపేశారు.. మనం కరెంట్ ఆపేశాం.. తెలంగాణ ప్రభుత్వంతో ప్రతిష్ఠంభనపై చంద్రబాబు


తెలంగాణ ప్రభుత్వంతో ప్రతిష్ఠంభన ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయని, అయినా ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం సీఎం నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 10వ షెడ్యూల్ ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి, ఢిల్లీలోని ఏపీ భవన్ అంశంతోపాటు నదీ జలాల వివాదాలు, విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అలాగే హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన సచివాలయ భవనాలను తమకు అప్పగిస్తే తాత్కాలిక అవసరాల కోసం ఓ భవనాన్ని కేటాయించడంతోపాటు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణం కోసం పదెకరాల స్థలాన్ని కేటాయిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపైనా పొలిట్ బ్యూరో విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గవర్నర్‌తో భేటీ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాల అంశం చర్చకు వచ్చినట్టు తెలిపారు. ఆ భవనాలున్న స్థానంలో సాధ్యమైనంత త్వరగా కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు గవర్నర్ తెలిపారని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు కల్పించుకుని..‘‘మనం విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్ల బకాయిలు పడింది. వారు మనకు బొగ్గు సరఫరా చేసినందుకు తెలంగాణకు మనం రూ.2వేల కోట్లు చెల్లించాలి. మనకు చెల్లించాల్సిన బకాయిల నుంచి వాటిని మినహాయించుకోమంటే వారు వినడం లేదు. బొగ్గు సరఫరా నిలిపివేశారు. మనం విద్యుత్ సరఫరా నిలిపివేశాం. కొన్ని విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్ఠంభన ఉన్న మాట నిజమే. అయినా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరం’’ అని సీఎం పేర్కొన్నారు. అపరిష్కృత అంశాలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పొలిట్ బ్యూరో సభ్యులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన అంశాలపై చర్చలు జరపడం ఉత్తమమన్న అభిప్రాయాన్ని పొలిట్ బ్యూరో వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News