: స్మార్ట్ఫోన్ బ్యాటరీల నుంచి ప్రాణాంతకమైన విషవాయువులు.. తాజా అధ్యయనంలో వెల్లడి
స్మార్ట్ఫోన్లతో వచ్చే ప్రతికూల అంశాల జాబితాలో మరో అంశం వచ్చి పడింది. అమెరికాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్బీసీ డిఫెన్స్, చైనాలోని సింఘువ యూనివర్సిటీ తాజాగా చేసిన పరిశోధనలో స్మార్ట్పోన్ల బ్యాటరీలు వందకుపైగా విష వాయువులను వెదజల్లుతున్నాయని తేలింది. ట్యాబ్లెట్లాంటి పరికరాల్లో వాడే బ్యాటరీల్లోనూ ఈ విషవాయువులు ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. ఇవి ప్రాణాంతకమైన విషవాయువులని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే బ్యాటరీల్లో ముఖ్యంగా లిథియమ్ బ్యాటరీలు వందకు పైగా విషవాయువులను వెదజల్లుతున్నాయని తమ అధ్యయనంలో స్పష్టమైందని వారు చెప్పారు. వాటిల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో చర్మ వ్యాధులు, కళ్లు, శ్వాస సంబంధ రుగ్మతలు వస్తాయని వారు హెచ్చరించారు. 50 శాతం ఛార్జ్ చేసిన బ్యాటరీ కంటే, పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీల నుంచి ఈ విషవాయువులు ఎక్కువగా విడుదల అవుతున్నాయని వారు పేర్కొన్నారు. అందుకు గల కారణాలను వివరిస్తూ... మొబైల్ ఫోన్ల నుంచి వాహనాల వరకూ లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగించడమే దీనికి కారణమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ బ్యాటరీలను రెండు బిలియన్ల వినియోగదారులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ పరిశోధనలో మెరుగైన బ్యాటరీల తయారీకి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.