: ప్రకంపనలు పుట్టిస్తున్న ఏటీఎం హ్యాకింగ్... ఎస్బీఐ అతిపెద్ద బాధితురాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెబిట్ కార్డుల హ్యాకింగ్ కుంభకోణంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద బాధితురాలిగా నిలిచిందని తెలుస్తోంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రకంపనలు పుట్టించిన ఈ స్కాంలో ఇప్పటివరకూ 19 బ్యాంకుల నుంచి 641 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించిన ఎన్పీసీఐ, దాదాపు రూ. 1.3 కోట్ల నష్టం జరిగినట్టు ధ్రువీకరించింది. ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశాలు ఉండగా, ఇప్పటివరకూ ఎస్బీఐకి చెందిన పలువురు ఖాతాదారుల నుంచి రూ. 12.5 లక్షలు అక్రమార్కుల ఎకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు తాము బ్లాక్ చేసిన డెబిట్ కార్డుల స్థానంలో కొత్త వాటిని మరో పది రోజుల్లో రీప్లేస్ చేయనున్నట్టు ఎస్బీఐ సీజీఎం పార్థా ప్రతీం సేన్ గుప్తా నేడు తెలిపారు. అనుమానిత డెబిట్ కార్డులను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్టు పలు బ్యాంకులు ప్రకటించాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఆర్బీఐ, ఆర్థిక శాఖతో పాటు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ లకు కొన్ని సూచనలు చేసింది. వినియోగదారుల ఖాతాలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.