: పాకిస్థాన్ నుంచి వస్తోన్న డ్రగ్స్ పంజాబ్‌లోనే కాదు ఏపీలోనూ ఉన్నాయి: మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన స‌్వరూపానంద
షిరిడీ సాయినాథుడు దేవుడు కాదంటూ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద చేస్తోన్న వ్యాఖ్యలపై సాయి భక్తులు ఈ రోజు తీవ్ర స్థాయిలో మండిపడి ఆందోళన తెలిపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ అంశంపై స్వరూపానంద ఏ మాత్రం తగ్గలేదు. ఈ రోజు విజయవాడలో మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. తమ వద్దకు వస్తే పాపాలన్నీ నశిస్తాయని సాయిబాబా దేవాలయాల్లో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. చాంద్ మియాను సాయి పేరుతో కొలుస్తున్నారని మరోసారి అన్నారు. దేశంలో డ్రగ్స్‌ను అరికట్టాల్సిన అవసరం ఉందని స్వరూపానంద అన్నారు. పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ పంజాబ్‌లోనే కాదు ఏపీలోనూ కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గీత, రామాయణం బోధిస్తే యువతను చెడుపట్టనివ్వకుండా ఆపొచ్చని చెప్పారు. సాయి రామాయణం, సాయి చాలీసాలను మనుషులే సృష్టించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. సాయి జన్మించినప్పుడు దేశం పరాయిపాలనలో ఉందని, ఆయన దేవుడయితే పరాయి పాలన నుంచి దేశాన్ని విడిపించాడా? అని ఆయన ప్రశ్నించారు. లాతూర్ లో కరవు వచ్చినప్పుడు కూడా సాయిబాబా ఏమీ చేయలేదని అన్నారు.