: మక్కా మసీదు పేలుడు కేసులో కీలక మలుపు... మాట మార్చిన మంత్రి
హైదరాబాదులోని మక్కా మసీదు బాంబు పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమర్ సింగ్ సడన్ గా మాట మార్చారు. కేసులోని నిందితుడు సునీల్ జోషి ఎవరో తనకు తెలియదని అడ్డం తిరిగారు. సీబీఐ అధికారులు తనను బలవంతపెట్టి గతంలో స్టేట్ మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, దేవేందర్ గుప్తా అనే వ్యక్తి ముస్లిం వ్యతిరేకి కాదని తెలిపారు. సీబీఐ మొదటి చార్జిషీటులో సునీల్ జోషి, దేవేందర్ గుప్తాలు తనకు తెలుసని రణధీర్ కుమార్ చెప్పినట్టు ఉంది. వాళ్లిద్దరూ తనకు స్నేహితులని... తన ఇంటికి తరచూ వస్తుంటారని ఆయన అన్నట్టు ఉంది. గుప్తాకు ఆవేశం చాలా ఎక్కువని... ముస్లింలు అంటే అతనికి వ్యతిరేక భావం ఉందని అన్నట్టు చార్జిషీటులో పేర్కొన్నారు. అయితే, జోషి ఎవరో తనకు తెలియదని రణధీర్ చెప్పడంతో, కేసు కీలక మలుపు తిరిగినట్టైంది. అజ్మీర్ దర్గా పేలుడు కేసులో కూడా గతంలో ఆయన ఇదే విధంగా మాట మార్చారు.