: హిందీ నటి పర్వీన్ బాబీ మరణించిన 11 ఏళ్ల తరువాత వీలునామా అమలు... 80 శాతం ఛారిటీకేనన్న బాంబే హైకోర్టు


బాలీవుడ్ అలనాటి అందాల తార పర్వీన్ బాబీ రాసిన వీలునామా చెల్లుతుందని, ఆమె కోరుకున్నట్టుగానే, 80 శాతం ఆస్తిని ఛారిటీ సంస్థలకు దానం ఇవ్వాల్సిందేనని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. 11 సంవత్సరాల క్రితం వీలునామా రాసి ఆమె మరణించగా, ఆమె బంధువులు ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. 2005లో పర్వీన్ విల్లు కోర్టు ముందుకు రాగా, ఈ వీలునామాను తప్పుడు డాక్యుమెంట్ గా కొందరు బంధువులు వాదిస్తూ వచ్చారు. ముంబైలోని జుహు సమీపంలో సముద్రానికి ఎదురుగా ఉన్న నాలుగు బెడ్ రూముల ఫ్లాట్, జునాగఢ్ లో హవేలీ, ఆభరణాలు, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితరాలు ఆమె ఆస్తులుగా ఉండగా, వీటి విలువలో 80 శాతాన్ని ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాధ బాలలు, వివిధ రకాల బాధలు పడుతున్న మహిళలకు చేయూత నిచ్చేందుకు ఖర్చు పెట్టాలని, ఈ ట్రస్టుకు పర్వీన్ బాబీ అని పేరు పెట్టాలని, ఆమె మేనమామ 82 ఏళ్ల మురాద్ ఖాన్ బాబీకి అప్పగించి, మిగతా 20 శాతం ఆస్తిని అతనికి ఇవ్వాలని హైకోర్టు తీర్పిచ్చింది. కాగా, 1970, 1980 దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన పర్వీన్ బాబీ, తన జుహూ ఫ్లాట్ లోనే ఒంటరిగా నివసిస్తూ, జనవరి 22, 2005న కన్ను మూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News