: పాకిస్థాన్ క్రికెట్ లో ఆసక్తికర వర్ధమాన ఆటగాడు... అందరి దృష్టీ ఇప్పుడు అతడిపైనే!
అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఎంతో మంది క్రికెటర్లు విభిన్నమైన ఆటతీరుతో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. బౌలింగ్ లో ఇన్ అండ్ అవుట్ స్వింగర్లు ప్రయోగించడంలో పాకిస్థాన్ బౌలర్లు నిష్ణాతులైతే, యార్కర్లకు కపిల్ దేవ్, గుడ్ లెంగ్త్ బంతులకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, నిలకడైన వేగానికి వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు ప్రసిద్ధి. అద్భుతరీతిలో ఫీల్డ్ లో చిరుతల్లా కదలడానికి జాంటీ రోడ్స్, న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రసిద్ధి. స్విచ్ షాట్లు, రివర్స్ స్వీప్, ఫ్లిక్, పుల్, లాఫ్టెడ్ షాట్లు ఇలా ఎన్నో కనిపెట్టారు. వర్ధమాన క్రికెట్ లో రైట్ హ్యాండ్ తోపాటు లెఫ్ట్ హ్యాండ్ తో కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సచిన్, ద్రవిడ్ సొంతం. అయితే ఇంతవరకు రెండు చేతులతో బౌలింగ్ చేయగల సామర్థ్యమున్న బౌలర్లు వెలుగులోకి రాలేదు. కొంత మంది పేసర్లు, రెండో చేత్తో స్పిన్ బౌలింగ్ వేయగలిగినా పేసర్లు మాత్రం లేరు. ఈ లోటు పూడ్చేందుకు పాకిస్థాన్ కుర్రాడు శరవేగంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు. లాహోర్ లో కూరగాయలమ్ముకునే కుటుంబానికి చెందిన పాకిస్థాన్ యువ పేసర్ యాసిర్ జన్ (21) రెండు చేతులతో పేస్ బౌలింగ్ వేయగల దిట్ట. స్వతహాగా కుడి చేతి వాటం బౌలర్ అయిన జెన్, కుడి చేతి వాటంగా గంటకు 145 కిమీ వేగంతో బంతులు విసరితే, చేతిని మార్చి ఎడమ చేత్తో 135 కిలోమీటర్ల స్పీడుతో బౌలింగ్ చేయగలడు. రావల్పిండిలో జరుగుతున్న పాక్ అండర్ 19 టోర్నీ సందర్భంగా జన్ టాలెంట్ వెలుగులోకి వచ్చింది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మన్ క్రీజులో కుదురుకుని విజయం దిశగా సాగుతున్న దశలో కెప్టెన్ కోరిక మేరకు బౌలింగ్ స్టాన్స్ తో పాటు వాటం కూడా మార్చి బ్యాట్స్ మన్ తోపాటు కోచ్ లకు కూడా షాకిచ్చాడీ కుర్రాడు. దీంతో అతని బౌలింగ్ విన్యాసాలకు అందరూ అచ్చెరువొందారు. భవిష్యత్ లో పాకిస్థాన్ జట్టుకు ఆశాకిరణంగా జన్ మారుతాడని అంతా జోస్యం చెబుతున్నారు.