: విదేశీ వ్యభిచారిణులు, హనీ ట్రాప్ ఆరోపణల్లో ఒక్క శాతం నిజమున్నా రాజకీయాల్లో ఉండను: వరుణ్ గాంధీ
వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ, ఓ యువతిని వరుణ్ గాంధీపై ప్రయోగించి, ఆయన్నుంచి సైనిక రహస్యాలు తస్కరించినట్టు అమెరికన్ న్యాయవాది సి.ఎడ్మండ్స్ అలెన్ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖ బీజేపీలో కలకలం సృష్టించగా, దానిపై వరుణ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, వాటిల్లో ఒక్క శాతం వాస్తవమున్నా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని, అసలు తనకు సైన్యం గురించిన రహస్య సమాచారమేదీ తెలియదని అన్నారు. తనపై ఎలాంటి హనీ ట్రాప్ ప్రయోగించబడలేదని అన్నారు. కాగా, వరుణ్ గాంధీ విదేశీ వ్యభిచారిణులతో గడుపుతున్న సీడీలు, చిత్రాలను ప్రధాని కార్యాలయానికి ఎడ్మండ్స్ పంపినట్టు తెలుస్తోంది. ఆపై ఆ చిత్రాలను చూపించే వరుణ్ గాంధీని బ్లాక్ మెయిల్ చేసి రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని అభిషేక్ వర్మ పొందినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.