: 2018 బడ్జెట్ సమావేశాల తర్వాత ఏపీలో ఏం జరగబోతోందో జోస్యం చెప్పిన ఉండవల్లి
2018 బడ్జెట్ సమావేశాల తర్వాత ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే, టీడీపీ నుంచి చాలా వికెట్లు టపటపా పడిపోతాయని ఆయన జోస్యం చెప్పారు. ఇదే సమయంలో, సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు ఏబీకేను ఓ ఉన్మాదితో పోల్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అవిశ్వాసం ఎదుర్కొంటున్న కోడెల శివప్రపాద్ స్పీకర్ సీటులో కూర్చోవడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఉండవల్లి విమర్శించారు. ఎలాంటి హక్కు లేని మండలి సభ్యుడు యనమల... నిబంధనల గురించి మాట్లాడటం మరో ఉల్లంఘన అని అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ డూప్ ను తయారు చేసుకుంటే తప్ప ఓటుకు నోటు కేసు నుంచి రేవంత్ రెడ్డి బయటపడలేరని ఉండవల్లి ఎద్దేవా చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని... ఈ వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరి, వారి రాజకీయాలను ఒంటబట్టించుకోలేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.