: అమరావతిలో క్యాంటీన్ల వివాదం... క్వాలిటీ ఫుడ్ అందిస్తున్న సీఆర్డీయే క్యాంటీన్ ను మూయించిన ఉద్యోగ సంఘాల క్యాంటీన్


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్యాంటీన్ల వివాదం అధికారులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మించక ముందే ఇక్కడ ఏర్పాటైన సీఆర్డీయే క్యాంటీన్ ను ఉద్యోగులు అంతా తరలివచ్చిన తరువాత ఏర్పాటైన ఉద్యోగ సంఘాల క్యాంటీన్ యాజమాన్యం బలవంతంగా తీసి వేయించడం వివాదాస్పదమైంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 'ఎన్టీఆర్ క్యాంటీన్'ను కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అసలు ఆ క్యాంటీన్ రాకుండానే, ఉన్న రెండు క్యాంటీన్ల మధ్యా గొడవలు తారస్థాయికి చేరాయి. సచివాలయ ఉద్యోగులు తమ వద్దకే రావాలంటూ ఉద్యోగ సంఘాల క్యాంటీన్ నిర్వాహకులు సీఆర్డీయే క్యాంటీన్ ను తీసివేయించారు. ఉద్యోగ సంఘాల క్యాంటీన్ లో భోజనం రూ. 50కి లభిస్తుండగా, సీఆర్డీయే క్యాంటీన్ లో పెరుగన్నం రూ. 10కి, ఇతర రైస్ వెరైటీలు రూ. 15కు లభిస్తున్నాయి. ఈ రెండూ దగ్గర దగ్గరగానే ఉండటంతో, ఉద్యోగులంతా సీఆర్డీయే క్యాంటీన్ వైపు వెళ్లడం మొదలు పెట్టారు. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందన్న ఉద్దేశంతో పావులు కదిపిన ఉద్యోగ సంఘాల క్యాంటీన్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరాలు తెలిపి సీఆర్డీయే క్యాంటీన్ ను మూసివేయించింది. క్యాంటీన్ కు తాళాలు వేసి, దాన్ని తెరవనీయకపోవడంతో ఉద్యోగులతో పాటు సందర్శకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News