: లోకేష్ కు క్లాస్ తీసుకున్న చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ కు చంద్రబాబునాయుడు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మూడు రోజులు గుంటూరులో, నాలుగు రోజులు హైదరాబాద్ లో ఉంటున్న లోకేష్ ను ఇకపై గుంటూరులోనే ఉండాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. పాలనపై పట్టుబిగించి, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంస్థాగత పటిష్టతపైనా దృష్టి సారించిన చంద్రబాబు, ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలను కలవలేక పోతున్నానని బాధపడుతున్నారట. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తూ, వివిధ పనుల నిమిత్తం వచ్చే నేతలు, కార్యకర్తలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలని నిర్ణయించారు. ఇక గుంటూరు కార్యాలయంలో ఎవరూ లేకుంటే, అక్కడికి వచ్చే వారంతా ఇబ్బంది పడతారని భావించి లోకేష్ ను, అన్ని రోజులూ గుంటూరులో ఉండాలని సూచించిన వేళ, తండ్రీ కొడుకుల మధ్య కాస్తంత పెద్ద చర్చే నడిచినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో మాదిరిగా చేయవద్దని, ఇకపై పూర్తిస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనీ, నాయకులు, ఎమ్మెల్యేలను తరచూ కలుసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. కలవాలంటే ముందస్తు అపాయింట్ మెంట్ తప్పనిసరి అన్న నిబంధనలు పెట్టుకోవద్దని, ఎవరైనా ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.