: కరణ్ జొహార్ కు మద్దతు పలికిన దర్శకురాలు
'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాలను అడ్డుకుంటామని ఎమ్మెన్నెస్ ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమాకు బాలీవుడ్ మొత్తం అండగా నిలబడడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకురాలు జోయ అక్తర్ 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాకు మద్దతు తెలిపారు. ఈ సినిమా విషయంలో వివాదం రేగడం దురదృష్టకరమని అన్నారు. కరణ్ ఎలాంటి తప్పుచేయలేదని, ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడే కరణ్ 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ పూర్తి చేశాడని ఆమె అన్నారు. ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయని, ఇది కరణ్ కు ఇబ్బందిగా మారిందని ఆమె తెలిపారు. దీనిపై బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ, పాకిస్థాన్ నటీనటులకు కేంద్ర ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని అన్నారు. సినీ నటులపై ఎలాంటి సెన్సార్ షిప్ అయినా బాధాకరమేనని ఆమె తెలిపింది. ఏ సినిమా చూడాలో, చూడకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని ఆమె చెప్పింది.