: చావు దెబ్బలు తిన్న గ్యాంగ్ స్టర్ మధుతో ఏపీ మంత్రి పల్లె... పాత చిత్రాలు వైరల్
రూ. 50 కోట్ల భూమి వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడని ఆరోపిస్తూ, మద్దెలచెరువు సూరి, భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధును కిడ్నాప్ చేసిన మంజునాథ్ గ్యాంగ్ బెంగళూరు శివారుల్లో చావు దెబ్బలు కొట్టిన వీడియో కలకలం రేపగా, ఆ వెంటనే మధు, ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసున్న చిత్రాలు, వీడియో బయటకు వచ్చి సంచలనమే సృష్టించాయి. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మధు, పల్లె విజయానికి కృషి చేశాడని, మంత్రి ఎప్పుడు గుంటూరుకు వెళ్లినా మధుయే ఏర్పాట్లు చేసేవాడని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి. మధు అండతో ఎన్నో పంచాయతీలు నిర్వహించి, వందలాది ఎకరాలను టీడీపీ నేతలు కారుచౌకగా కొట్టేశారన్న ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మధును కొట్టి, కిడ్నాప్ చేసిన తరువాత ఈ చిత్రాలు, వీడియో బయటకు రావడం గమనార్హం. ఓ గ్యాంగ్ స్టర్ తో తాను కలిసున్న చిత్రాలు బయటకు రావడంపై మంత్రి పల్లె స్పందించాల్సి వుంది.