: ట్రంప్ లైంగిక వేధింపుల పర్వం.. యోగా ట్రైనర్ తాజా ఆరోపణలు!
ఫైనల్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ముగిసినా ట్రంప్ పై లైంగిక ఆరోపణలు ఆగడం లేదు. ధనమదంతో ట్రంప్ చేసిన పాపాలు అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు గుదిబండగా మారాయి. తాజాగా యోగా ట్రైనర్ కరెనా వర్జీనియా (45) ట్రంప్ ఘనకార్యాన్ని వెల్లడించారు. ఈ మేరకు వాషింగ్టన్ లో ఆమె మాట్లాడుతూ, పద్దెనిమిదేళ్ల కిందట యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్లేయర్స్ కు తాను ట్రైనర్ గా పని చేస్తున్న సమయంలో ట్రంప్ ను తొలిసారి ఎదుర్కొన్నానని అన్నారు. టెన్నిస్ టోర్నీకి వచ్చిన ట్రంప్ తనతో పాటు ఉన్న ఓ వ్యక్తితో 'ఆమెను చూడు.. గతంలో ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఓసారి ఆమె కాళ్లను గమనించు' అని కామెంట్ చేశాడని తెలిపింది. అనంతరం తన వద్దకు వచ్చిన ట్రంప్ 'నా చేయి పట్టుకుని నన్ను గట్టిగా దగ్గరకు లాక్కుని వ్యక్తిగత అవయవాలను బలవంతంగా టచ్ చేశాడు' అంటూ వర్జీనియా తెలిపింది. ఆ సమయంలో తన వయసు 27 ఏళ్లని, ఆ క్షణంలో తాను షార్ట్ డ్రెస్ తో పాటు హై హీల్స్ వేసుకోవడంతో సరిగ్గా స్పందించక నిస్సహాయురాలిగా ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆరోపణలపై ట్రంప్ మద్దతుదారులు మండిపడుతున్నారు. ట్రంప్ ను అధ్యక్షుడిగా చూడడం ఇష్టంలేని మహిళలు ఉద్దేశపూర్వకంగా ఆయనపై బురద జల్లుతున్నారని పేర్కొంటున్నారు.