: బ్రేకింగ్ న్యూస్... ఈ నెల 27న జయలలిత అపోలో నుంచి డిశ్చార్జ్?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 26 లేదా 27 తేదీల్లో అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యే అవకాశముందని అన్నాడీఎంకే వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే... ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమెకు లండన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే సమక్షంలో అపోలో ఆసుపత్రి, ఎయిమ్స్, సింగపూర్ వెద్య నిఫుణులు చికిత్స అందిస్తున్నారు. సుమారు నెల రోజులుగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో తమిళనాట తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ ఆమె కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యుల బృందం మరోసారి ఆమె ఆరోగ్యంపై పూర్తి అధ్యయనం చేసి, డిశ్చార్జ్ పై నిర్ణయం తీసుకోనున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోది. ప్రస్తుతం జయలలితకు ఫిజియోథెరపీ చికిత్స మాత్రమే కొనసాగుతోంది. దీంతో ఆమె పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో వుంటే సరిపోతుందని వైద్యులు చెప్పినట్టు అన్నా డీఎంకే ఆ ప్రకటనలో తెలిపింది.