: అఖిలేష్ కు కీడు తలపెడుతున్నారు... సమాజ్ వాది పార్టీలో ‘లేఖ’ కలకలం!
సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ ను ఆ పదవి నుంచి తప్పుకోవాలంటూ వచ్చిన ఒక ‘లేఖ’ ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. సీఎం అఖిలేశ్ యాదవ్ కు సన్నిహితుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ ఈ లేఖ రాశారు. పార్టీ అధినేతగా ములాయం సింగ్ తప్పుకుని, అఖిలేశ్ ను నియమించాలని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ములాయంకు రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. పార్టీ నేతల్లో చాలామంది ములాయం తప్పుకోవాలనే పట్టుబడుతున్నారని, ములాయం రెండో భార్య సాధనకు కూడా అఖిలేశ్ అంటే అసూయ భావనే ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అంతేకాకుండా, శివపాల్ యాదవ్, సాధన కలిసి అఖిలేశ్ కు కీడు తలపెట్టాలని చూస్తున్నారని ఉదయ్ వీర్ ఆరోపించారు. ఎస్పీ యువనేతలపై బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ లేఖపై ఎస్పీ నేత ఆషు మాలిక్ స్పందిస్తూ, ఈ లేఖలకు ఎటువంటి విలువ లేదని, కనీసం 500 ఓట్ల విలువ కూడా చేయవని అన్నారు. తమ పార్టీ అధినేతను కించపరిచే విషయాలను ఎట్టి పరిస్థితిలోనూ సహించే ప్రసక్తే లేదన్నారు.