: రక్షణ శాఖ రహస్యాలు లీక్ చేస్తున్న వరుణ్ గాంధీ.. ప్రధానికి అమెరికా లాయర్ లేఖ
భారత రక్షణ శాఖ రహస్యాలను ఆయుధాల డీలర్ అభిషేక్ వర్మకు లీక్ చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన లాయర్ సి ఎడ్మండ్స్ అలెన్ ఈ మేరకు ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు లేఖలు రాశారు. ఈ లేఖలను అలెన్ బయటపెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 1 బిలియన్ డాలర్ల డీల్ ను తన క్లయింట్ కు దక్కించుకునేందుకు ఆయుధాల డీలర్ అభిషేక్ వర్మ ప్రయత్నిస్తున్నాడని, ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ, సీనియర్ మాజీ అధికారి ఎయిర్ మార్షల్ హరీష్ మాసంద్ ల సాయం పొందుతున్నాడని ఆరోపించారు. పార్లమెంటరీ కమిటీ (రక్షణ శాఖపై )లో సభ్యుడిగా ఉన్న వరుణ్ గాంధీ భారత రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని వర్మకు, ఆయనకు సంబంధించిన ఆయుధ వ్యాపారులకు అందజేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. వ్యభిచారులతో వరుణ్ గాంధీ ఉన్న ఫొటోలను చూపించి ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి, ఆయా వ్యక్తులు వారికి కావాల్సిన సమాచారం పొందుతున్నారని ఆరోపించారు. కాగా, ఆయుధాల డీలర్ అభిషేక్ వర్మతో అలెన్ కు గతంలో వ్యాపార సంబంధాలు ఉండేవి. కొన్ని కారణాల వల్ల 2012లో వారి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఇటువంటి ఫొటోలు ఏవైనా ఉంటే, అవి మార్ఫింగ్ చేసినవేనని ఆయన అన్నారు. పార్లమెంటరీ కమిటీ నిర్వహించిన ఏ సెషన్ కు తాను హాజరుకాలేదని చెప్పారు.