: 'చైనా ప్రొడక్టుల బాయ్ కాట్' ప్రచారాన్ని పట్టించుకోని ఇండియన్స్... 18 రోజుల్లో 10 లక్షల హ్యాండ్ సెట్లమ్మిన జియోమి


ఓ వైపు చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని భారతదేశంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, ప్రజలు దాన్ని పట్టించుకోవడం లేదని చైనా అధికారిక మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న పండగ సీజన్ లో జియోమీ సంస్థ రికార్డు స్థాయిలో 18 రోజుల వ్యవధిలోనే 10 లక్షల స్మార్ట్ ఫోన్లను విక్రయించిందని, ఇండియాలో ప్రస్తుతం అతిపెద్ద స్మార్ట్ ఫోన్ విక్రయందారు జియోమీయేనని వెల్లడించింది. ప్రపంచంలోనే శరవేగంగా భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ పెరుగుతోందని, వచ్చే ఐదేళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటాను నమోదు చేయడమే తమ లక్ష్యమని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీ జున్ వెల్లడించినట్టు 'చైనా డైలీ' పేర్కొంది. ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించాలని భావిస్తున్న తమకు భారత మార్కెట్ అత్యంత ముఖ్యమని ఆయన చెప్పినట్టు పేర్కొంది. చైనా తరువాత ఇండియానే తమకు పెద్ద మార్కెట్ గా అభివర్ణించిన లీ జున్, ప్రతి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ కళ్లూ ఇండియాపై ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ 15 శాతం వృద్ధిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల చేతుల్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో అత్యధికం చైనా బ్రాండ్లవే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News