: పాకిస్థాన్ లో సంపాదించిన డబ్బును అక్కడి ప్రజల సంక్షేమానికే ఖర్చు పెడుతున్నా: బాబా రాందేవ్


చైనా వస్తువులను బహిష్కరించాలంటూ భార‌తీయులు సామాజిక మాధ్య‌మాల్లో ఉద్య‌మంలా పోస్టులు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తోన్న యోగా గురువు బాబా రాందేవ్ మ‌రోసారి ఇదే అంశంపై పిలుపునిచ్చారు. చైనా వ‌స్తువుల‌ను ఎందుకు తిర‌స్క‌రించాలో కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. ఓ జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న తాజాగా మాట్లాడుతూ... భారతదేశంలో చైనా త‌మ దేశ వ‌స్తువులు అమ్ముకొంటూ ధ‌నం సంపాదించి, పాక్‌కు సాయం చేస్తోంద‌ని అన్నారు. భార‌త్‌లో చైనా వ‌స్తువులను బ‌హిష్క‌రించి ఆ దేశ‌ పాలకులపై సామాజిక-ఆర్థిక ఒత్తిడి తీసుకురావాల‌ని, అందుకే తాను ఆ దేశ‌ వస్తువులు వాడకూడ‌ద‌ని చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ న‌టులు, టెక్నీషియ‌న్ల నిషేధం అంశంలో చెల‌రేగుతున్న వివాదంపై స్పందించిన రాందేవ్‌.. వారు తీవ్రవాదులు కాదని పేర్కొన్నారు. అయితే, హిందీ సినిమాల్లో నటిస్తున్న వారికి మనస్సాక్షి లేదని పేర్కొన్నారు. డబ్బు సంపాదన, బిర్యానీ తినడం లాంటి విష‌యాల‌పైనే వారు దృష్టి పెడుతున్నార‌ని, యూరీలో జ‌రిగిన ఉగ్ర‌దాడిని వారు ఎందుకు ఖండించలేదని ప్ర‌శ్నించారు. తాను పాకిస్థాన్ నటీనటుల వంటివాడిని కాదని, త‌న‌కు ఆ దేశంలో సంపాదించిన డబ్బును భార‌త్‌కు తరలించాలన్న ఆశ లేద‌ని, అందుకే త‌న ప‌తంజ‌లి శాఖను పాకిస్థాన్‌లో నిర్వహిస్తున్నాన‌ని చెప్పారు. ఆ దేశంలో సంపాదించిన ధ‌నాన్ని పాక్‌ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నట్లు పేర్కొన్నారు. త‌న‌కు పంతజలిలో షేర్లు లేవ‌ని పేర్కొన్నారు. తాను సాధార‌ణ జీవితం గడుపుతున్నానని చెప్పారు. యోగికి ఆనందం, దుఃఖం అంటూ ఏమీ ఉండ‌వ‌ని, నరేంద్ర మోదీ విజయవంతమైన ప్రధాన మంత్రి అని ఆయ‌న ఎన్డీఏ పాల‌న‌పై స్పందించారు. మోదీపై త‌న‌కు నమ్మకం ఉందని పేర్కొన్నారు. త‌న‌కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. తాను దేశ రాజ‌కీయాల్లో ఎన్న‌డూ ప‌ద‌వులు ఆశించబోన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News