: భర్త ఫిర్యాదుతో భార్యను కాపాడేందుకు వచ్చి, చివరికి ఆమెనే కాల్చిచంపిన అమెరికా పోలీసులు!
మతిభ్రమించిన తన భార్య ఆపదలో ఉందని, ఆమెను కాపాడాలని ఓ యువకుడు 911కు ఫిర్యాదు చేస్తే, కాపాడేందుకు వచ్చిన పోలీసులు విధిలేని పరిస్థితుల్లో ఆమెనే కాల్చి చంపాల్సి వచ్చింది. ఈ ఘటన సౌత్ ఆస్టిన్ లోని సమ్మర్ వ్యాలీ అపార్టుమెంట్ లో జరిగింది. తన భార్య చేతిలో తుపాకీ ఉందని, మానసిక వైద్యాధికారులను పంపాలని ఆమె భర్త ఫిర్యాదు చేస్తే, ఇద్దరు పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. మికా జెస్టర్ అనే మహిళ, సెమీ ఆటోమేటిక్ బీబీ గన్ ప్రతిరూపమైన బొమ్మ తుపాకీని పట్టుకుని తన వద్దకు వచ్చిన వారిని బెదిరిస్తోంది. అయితే, దాన్ని నిజం తుపాకిగా భావించిన పోలీసులు, ఆమె నుంచి తుపాకీని తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తుపాకిని పోలీసులకు గురి పెడుతూ, "నన్ను కాల్చండి... నన్ను చంపండి" అని అరుస్తూ ముందుకు రాబోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఆమెను కాల్చారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆమె చేతిలోది బొమ్మ తుపాకి అని తరువాత తెలుసుకున్న పోలీసుల వైఖరిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మానసిక వికలాంగులను పోలీసులే కాల్చి చంపుతున్న కేసులు పెరుగుతున్నాయని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది.