: పక్షుల్లో ప్రమాదకర హెచ్5ఎన్1 వైరస్... ఢిల్లీ జూ నిరవధిక మూత
ఢిల్లీ లోని జంతు ప్రదర్శనశాల నిరవధికంగా మూతపడింది. మూడు పక్షుల్లో ప్రమాదకర హెచ్5ఎన్1 ఇన్ ఫ్లూయంజా వైరస్ ను కనుగొన్న అధికారులు జూ సందర్శనను ఆపేస్తున్నట్టు తెలిపారు. మిగతా పక్షులకు, అందరు ఉద్యోగులకూ వాక్సిన్లు వేస్తున్నామని, కనీసం మూడు రోజుల పాటు సందర్శకులను అనుమతించలేమని స్పష్టం చేశారు. పక్షుల్లో సోకిన ఈ బర్డ్ ఫ్లూ వైరస్, మానవులకూ సులువుగా సంక్రమిస్తుంది. ఇప్పటివరకూ హ్యూమన్ బర్డ్ ఫ్లూ కేసు ఇండియాలో నమోదు కానప్పటికీ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. గత శుక్రవారం నుంచి ఈ వైరస్ బారినపడిన 10 పక్షులు జూలో మరణించాయి. మరణించిన పక్షుల్లో కొంగలు, బాతులు అధికంగా ఉన్నాయని జూ అధికారులు తెలిపారు. మృతి చెందిన వాటిని లాబొరేటరీకి తరలిస్తున్నట్టు డిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. పరిస్థితి ప్రమాదకరమేమీ కాదని, జూలోని మిగతా పక్షులు, ఉభయచరాలకు ఈ వైరస్ సోకలేదని తెలిపారు. కాగా, నిన్న జూను సందర్శించిన కేంద్ర వైద్య బృందం, కనీసం 14 నుంచి 15 ఎన్ క్లోజర్లకు ఈ వైరస్ వ్యాపించి వుండవచ్చని, 20 బాతులు, 40 కొంగలకు వైరస్ సోకి ఉండవచ్చని అంచనా వేసినట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ ప్రస్తుతం పరిశీలనలో ఉంచారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత, జూను తిరిగి తెరుస్తామని అధికారులు ప్రకటించారు.