: ‘ఏ దిల్‌హై ముష్కిల్’ సినిమా విడుదల కోసం కాసేపట్లో రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్న కరణ్‌జొహార్
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్‌జొహార్ ‘ఏ దిల్‌హై ముష్కిల్’ సినిమా విడుదలకు ‘పాక్ నటుల’ కష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రభావంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పాటు పలు సినీ సంస్థలు పాక్ నటులు నటించిన ఏ సినిమాలను కూడా విడుదల చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు వస్తుండడంతో తాము ఎంతగానో నష్టపోతామని కరణ్‌జొహార్ వాపోయాడు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కరణ్జొహార్తో పాటు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు ముకేష్ భట్, సిద్ధార్థరాయ్ కపూర్ తో పాటు పలువురు నిర్మాతలు మరికాసేపట్లో కలవనున్నారు. ఈ సినిమాను విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా కోరనున్నారు. బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. సినిమాను విడుదల చేయనున్న పలు థియేటర్ల ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఇప్పటికే ఆందోళన చేసి హెచ్చరికలు జారీ చేసింది. సినిమా విడుదలకు భద్రత కల్పించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కరణ్‌జొహార్ కోరనున్నట్లు తెలుస్తోంది.