: ప్రతి ఒక్కరూ ఏటీఎం పిన్ మార్చుకోవాల్సిందే... 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కులకు!


దేశంలోని 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్న బ్యాంకులు, ప్రతి ఒక్కరూ వెంటనే తమ ఏటీఎం పిన్ నంబర్ ను మార్చుకోవాలని సూచిస్తున్నాయి. పిన్ లేకుండా జరిగే అంతర్జాతీయ లావాదేవీలనన్నింటినీ నిలిపివేసిన బ్యాంకులు, డెబిట్ కార్డుల సమాచారమెంతో బయటకు పొక్కిందని అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరందరికీ కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. కాగా, యస్ బ్యాంకుకు చెందిన ఖాతాదారుల్లో అత్యధికుల వివరాలు బయటకు పొక్కినట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకు ఏటీఎం నెట్ వర్క్ ను హిటాచీ పేమెంట్ సర్వీసెస్ నిర్వహిస్తుండగా, సెక్యూరిటీ వలయాలను బద్దలుకొట్టిన హ్యాకర్లు మొత్తం సమాచారాన్ని హస్తగతం చేసుకున్నారని తెలుస్తోంది. యస్ బ్యాంకుకు తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉండగా, ఇతర బ్యాంకుల కార్డుల నుంచి డబ్బు విత్ డ్రా అవుతున్న లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. మిగతా ఏ బ్యాంకు ఏటీఎంలలోనూ యస్ బ్యాంక్ ఏటీఎంలలో నమోదవుతున్నన్ని థర్డ్ పార్టీ లావాదేవీలు సాగడం లేదని తెలుస్తోంది. దీంతో బ్యాంకు అధికారులు విచారణ జరిపి తమ ఏటీఎంలలో ఎలాంటి అవకతవకలూ జరగలేదని ప్రకటించింది. అయినప్పటికీ, అనుమానం ఉన్న ఏటీఎంలలో జరిపిన లావాదేవీలకు సంబంధించిన కార్డులను మారుస్తున్నట్టు పేర్కొంది. ఇక దేశంలోని ప్రతి బ్యాంకు ఖాతాదారూ వెంటనే తమ తమ ఏటీఎం పిన్ నంబర్ ను మార్చుకోవాలని తద్వారా హ్యాకర్ల తప్పుడు లావాదేవీలను అధిక శాతం అరికట్టవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ లోనీ ఆంటోనీ స్పందిస్తూ, తుది నివేదిక వచ్చే వరకూ తానేమీ వ్యాఖ్యానించబోనని, కొత్త కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని తెలిపారు. చాలా బ్యాంకులు పిన్ నంబర్ మార్చుకోవాలని సూచిస్తుంటాయని, ఇది సాధారణంగా జరిగేదేనని అన్నారు.

  • Loading...

More Telugu News