: ‘జాతి వ్యతిరేక కార్యకలాపాలు’... జమ్ముకశ్మీర్లో 12 మంది అధికారులపై వేటు
హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భారత సైన్యం హతమార్చిన తరువాత గత మూడు నెలలుగా కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారుల కార్యకలాపాలపై దృష్టి సారించిన ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో 12 మంది అధికారులపై వేటు వేసింది. రాష్ట్రంలోని పలు శాఖల్లో అధికారులుగా విధులు నిర్వహిస్తోన్న వీరు జాతి వ్యతిరేక కార్యకలాపాలు(యాంటీ నేషనల్ యాక్టివిటీస్) చేస్తున్నారని పేర్కొంది. విద్యాశాఖ, రెవెన్యూ, వైద్యారోగ్య, ఇంజినీరింగ్, పౌర సరఫరాల శాఖల్లో పనిచేస్తోన్న వీరిపై ఇటీవలే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఆరోపణలు వచ్చాయని, వీరు పాల్పడుతున్న చర్యలపై తమకు పోలీసుల నుంచి నివేదిక కూడా అందిందని తెలిపింది. తమకు అందిన నివేదికను పరిశీలించి, సదరు ఉద్యోగులను తొలగించాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పింది. వీరిలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.