: 'నీకు నోటి దురుసు ఎక్కువ'ని హిల్లరీ అంటే ... 'నీది క్రూరస్వభావ'మని ట్రంప్.. పరస్పరం ఆడిపోసుకున్న అధ్యక్ష అభ్యర్థులు
అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఫైనల్ బిగ్ డిబేట్ లో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించుకున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు ఎంతో సంయమనం అవసరమని డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడి వద్ద అణ్వాయుధాలకు సంబంధించిన కీలక సమాచారం ఉంటుందని, అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న నాలుగు నిమిషాల్లో వాటి ప్రయోగం జరిగిపోతుందని ఆమె వెల్లడించారు. ట్రంప్ లాంటి నోటి దురుసు వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడైతే వాటి వినియోగంపై అయోమయం నెలకొంటుందని అన్నారు. దూకుడు స్వభావంతో మెక్సికోకు గోడకడతాం, ముస్లింలను రానివ్వం, భారత్, చైనీయులను దేశం నుంచి వెళ్లగొడతామని చెప్పే ట్రంప్ చేతికి అవి చేరితే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పాల్సిన పని లేదని ఆమె అన్నారు. దీంతో మండిపడ్డ ట్రంప్... తాను కేవలం మాటలు మాత్రమే చెప్పానని, హిల్లరీది క్రూరస్వభావమని, ఈమెయిల్స్ ను అకౌంట్ నుంచి తీసేసినంత సైలెంట్ గా ఆమె ఏ పనైనా చేసేస్తారని ఆయన విమర్శించారు. తనవి దూకుడు వ్యాఖ్యలని హిల్లరీ చెబుతున్నారని, మరి మెక్సికన్లు, ముస్లింలపై ఆమె విధానం ఏంటని ఆయన నిలదీశారు. తనవి దూకుడు వ్యాఖ్యలు కాదని, అమెరికన్లను కాపాడే వ్యాఖ్యలని ఆయన అన్నారు. హిల్లరీ క్లింటన్ తనపై అబద్ధాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.