: హిల్లరీకి 256, ట్రంప్ కు 176... ఓట్ల లెక్కలు తేల్చేసిన మీడియా సంస్థలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రసార మాధ్యమాలు తేల్చేశాయి. బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మధ్య చివరి బిగ్ డిబేట్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. హిల్లరీకి 92 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించగా, ట్రంప్ కన్నా క్లింటన్ 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని బ్లూమ్ బర్గ్ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లుండగా, 270 ఓట్లు వచ్చిన వారు వైట్ హౌస్ పీఠాన్ని అధిరోహించవచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం ట్రంప్ కు 176, హిల్లరీకి 256 ఓట్లు రావడం తథ్యమని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మిగిలిన 112 ఓట్లలో 14 ఓట్లను హిల్లరీ గెలుచుకుంటే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని పేర్కొంది. ఇదిలావుండగా, హిల్లరీ క్లింటన్ ప్రత్యర్థి వర్గంలోని వ్యూహకర్త, రిపబ్లికన్ ప్రజా ప్రతినిధి స్టీవ్ స్కిమిట్ అయితే, క్లింటన్ కు ఏకంగా 400 ఓట్లు రానున్నాయని చెప్పడం గమనార్హం. తదుపరి ప్రభుత్వంలో డెమోక్రాట్లు అధిక సంఖ్యలో సెనెట్ లో కనిపిస్తారని ఆయన జోస్యం చెప్పారు.