: బిగ్ ఫైనల్ డిబేట్ లో ఎడమొహం పెడ మొహంగా ట్రంప్, హిల్లరీ


అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ లిద్దరూ లాస్ వెగాస్ లో ఫైనల్ బిగ్‌ డిబేట్‌ లో పాల్గొన్నారు. గత రెండు డిబేట్లు ప్రారంభానికి ముందు ఒకర్నొకరు కరచాలనంతో పలకరించుకుని డిబేట్లను ప్రారంభించారు. ఫైనల్ డిబేట్ లో మాత్రం వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించుకున్న వీరిద్దరూ ఇప్పటికే తమ విధానాలను దేశ ప్రజలకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మర్యాదలు అవసరం లేదని భావించారో ఏమో కానీ ఈసారి మాత్రం వీరిద్దరూ కనీసం మర్యాదపూర్వకంగా కూడా కరచాలనం చేసుకోలేదు. అంతే కాదు, కనీసం క్రీగంట చూసుకోను కూడా చూసుకోలేదు. డిబేట్ లో భాగంగా ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానం ఇచ్చినప్పుడు తప్ప ఇతర సందర్భాల్లో ఒకర్నొకరు పట్టించుకోలేదు. 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ డిబేట్‌ ని ఆరు విభాగాలుగా విభజించారు. జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్‌ గా ఫిట్‌ నెస్‌ వంటి అంశాలపై మోడరేటర్‌ (సంధానకర్త) క్రిస్‌ వాలెస్‌ ప్రశ్నలడగ్గా, హిల్లరీ, ట్రంప్ సూటిగా సమాధానం ఇచ్చారు. ఈ డిబేట్‌ లో కూడా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో లాస్ వెగాస్ దద్దరిల్లింది. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News