: అమెరికా తిరుగులేని శక్తిగా నిలవాలంటే మిత్రదేశాలకు అండగా నిలవాలి: హిల్లరీ
జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియాలకు మనం మద్దతుగా నిలవాల్సిందేనని అమెరికా డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో నిర్వహించిన ఫైనల్ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ మధ్య చివరి సమరం జరిగింది. ఈ సందర్భంగా మిత్రదేశాల్లో సైన్యాన్ని మోహరించి, వారికి మద్దతుగా ఎందుకు నిలవాలని ట్రంప్ ప్రశ్నించడంతో హిల్లరీ గట్టిగా సమాధానం చెప్పారు. అమెరికా అగ్రదేశంగా, ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలవాలంటే మిత్రదేశాలకు అండగా నిలవాలని ఆమె అన్నారు. మిత్రదేశాల సహాయ సహకారాలు తీసుకోవడమే కాకుండా, ఆయా దేశాలకు అండగా నిలవడం ద్వారా అమెరికా తన స్థాయిని నిలబెట్టుకుంటుందని ఆమె అన్నారు. అంతర్జాతీయ సంబంధాలను విశాల దృక్పథంతో చూడాలని ఆమె సూచించారు. అమెరికా ఎప్పుడూ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలనే భావిస్తుందని, అందులో భాగంగా జపాన్, కొరియా, యూరోపియన్, మిడిల్ ఈస్ట్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.