: సానియా మీర్జా, సంజయ్ మంజ్రేకర్ మధ్య పేలిన ట్వీట్ల తూటాలు
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, టీమిండియా వెటరన్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మధ్య ట్వీట్ల తూటాలు పేలాయి. డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకర్ గా 80 వారాలు పూర్తి చేసుకున్న సానియా మీర్జా తన సహచరులతో సంబంధం లేనట్టుగా ‘ప్రపంచ నెం 1 గా 80 వారాలు పూర్తి చేసుకున్నా. ఎంతో సంతోషంగా ఉంది. మరింత కష్టపడడానికి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని సానియా మీర్జా ట్వీట్ చేసి తన సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లోని పలువురితో సత్సంబంధాలు నెరపే సానియా మీర్జాకి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలతోపాటు ఇతరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన సంజయ్ మంజ్రేకర్ ‘నువ్వు చెప్పేది టెన్నిస్ లో నెం 1 డబుల్స్ ప్లేయర్ అనే కదా? శుభాకాంక్షలు’ అని అభినందించాడు. అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే ఇలా ఎద్దేవా చేయడాన్ని తట్టుకోలేకపోయిన సానియా మీర్జా... కొన్నేళ్లుగా సింగిల్స్ ఆడడం లేదు. కానీ ఇలా అడగడం సబబా? అజ్ఞానం తోనా? కామన్ సెన్స్ అందరికీ కామన్ కాదనుకుంటా' అని సానియా కాస్త ఘాటుగా సమాధానం చెప్పింది. దీంతో కామెంటేటర్ అయిన సంజయ్ మంజ్రేకర్ ఏ మాత్రం తగ్గకుండా తనలాంటి కామన్ సెన్స్ లేనివాళ్లకు కూడా అర్థమయ్యేలా వివరంగా చెప్పాలంటూ మళ్లీ సమాధానమిచ్చాడు. వెంటనే సానియా మీర్జా 'ఓ వెబ్ సైట్ లో ఆర్టికల్ ఉంది, దానిని చదువు' అంటూ సమాధానమిచ్చింది. దీంతో మళ్లీ స్పందించిన మంజ్రేకర్ 'ఆ ఆర్టికల్ లో కూడా నువ్వు నెం 1 డబుల్స్ ప్లేయర్ వేనని రాసి ఉంది. అదే కదా, నేనూ చెప్పింది కూడా.. సర్లే దీనిపై ఇక వాదనలు అనవసరం' అంటూ ముగించాడు. దీంతో వీరి సంభాషణ నెటిజన్లను అలరించింది. అయితే సానియా మీర్జా డబుల్స్ జోడీ గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతుండగా, ఆమె అభిమానులు మాత్రం సంజయ్ మంజ్రేకర్ ఇలా అడిగి ఉండకూడదని పేర్కొంటున్నారు.