: చంద్రబాబుకు ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో, ఈ ప్రాజెక్ట్ ను చూస్తే అర్థమవుతుంది: వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లా బేతపూడిలో ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. బాధితులు తమ బాధలను జగన్ తో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం సేకరించకుండానే ఈ ఫ్యాక్టరీ పెడుతున్నారని అన్నారు. ప్రజలను కలెక్టర్ కూడా తప్పుదోవ పట్టించారని, ప్రాజెక్ట్ ను వ్యతిరేకించిన వారిపై హత్యాయత్నం కింద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నలభై రోజులుగా అమాయకులను జైల్లో పెట్టారని, ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీతో కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ‘రొయ్యలను శుద్ధి చేస్తే కాలుష్యం వెలువడకుండా ఎలా ఉంటుంది? సీఎం చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి. ఒకవైపు ఏమో కాలుష్యం రాదంటారు.. మరోవైపు పైప్ లైన్ వేస్తామంటారు! పైప్ లైన్లు వేయడానికి భూములు ఎవరు ఇస్తారు? డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరు భరిస్తారు? చంద్రబాబుకు ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో, ఈ ప్రాజెక్ట్ ను చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు డ్రామాలను పక్కనపెట్టి ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ ను సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి. సముద్ర తీర ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంచి జరుగుతుంది. గ్రామాల్లో 144వ సెక్షన్ విధించి ఈ ఫ్యాక్టరీని కట్టడం అవసరమా? ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలిస్తే మేం కూడా మద్దతు ఇస్తాం’ అని వైస్ జగన్ అన్నారు.