: షాకింగ్ న్యూస్...వైరల్ అయిన కేంద్రీయ విద్యాలయ వీడియో బాధితుడ్ని ఎందుకు కొడుతున్నారో తెలుసా?
వారం రోజుల క్రితం ఓ వీడియో సోషల్ మీడియాను పట్టికుదిపేసింది. బీహార్ లోని ముజఫర్ పూర్ లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ విద్యార్థిని తరగతిలో 'ఇద్దరు అన్నదమ్ములు కొడుతున్న వీడియో' అంటూ ప్రచారమైన వీడియోలోని బాధితుడు చెబుతున్న విషయాలు మరింత సంచలనం రేపుతున్నాయి. అసలేం జరుగుతోందో అతని మాటల్లోనే... "నా వయసు 16. బీహార్ లోని ముజఫర్ పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. మా నాన్న ఉపాధ్యాయుడు. నాకు ఇద్దరు చెల్లెళ్లున్నారు. నేను బాగా చదివి ప్రయోజకుడిని కావాలని మా నాన్న నన్ను మా అమ్మమ్మ వాళ్లింట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదువుతున్నాను. నేను మంచి మార్కులు తెచ్చుకుంటే నా తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ తోటి విద్యార్థులు మాత్రం అందుకు నన్ను చావగొడుతున్నారు. మీకు ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ, గత రెండేళ్లుగా రోజూ నన్ను క్లాస్ రూంలో ఇద్దరు విద్యార్థులు కొడుతున్నారు. దళితుడినన్న ఒకే ఒక్క కారణంతో వారు నన్ను రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీనిపై పోలీసులకు, నా స్నేహితులకు ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయాను తప్ప నా మాటలను ఎవరూ పట్టించుకోలేదు. వారిద్దరూ అన్నదమ్ములు. అందులో ఒకడు నా జూనియర్. వారానికి ఓ రోజైనా నా మొహాన ఉమ్మేయందే వూరుకోరు. మా టీచర్ కి నా బాధ చెప్పుకొంటే ఓపిగ్గా విని నా పట్ల సానుభూతి చూపుతారు కానీ వారిద్దరినీ ఏమీ అనలేరు. ఎందుకంటే, వారి తండ్రి పవరఫుల్ క్రిమినల్. పోలీసు కేసు పెడదామంటే నన్ను పాఠశాల నుంచి డిస్మిస్ చేస్తారు. అదీకాకుండా వాళ్ల నాన్న క్రిమినల్ కాబట్టి మా ఫ్యామిలీకి హాని తలపెడతారన్న భయం నన్ను వెంటాడుతోంది. నన్ను కొడుతున్న వీడియో బయటికి రావడంతో మా అమ్మమ్మ, తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నన్ను కొడుతున్నప్పుడు క్లాస్ రూంలో మరో విద్యార్థి దీనిని రికార్డ్ చేశాడు. నన్ను అలా కొడుతుంటే అతనికి సరదాగా ఉంటుందట. అందుకే వీడియో తీశానని ఓసారి నాతో చెప్పాడు. పైగా ఆ విద్యార్థి ఎప్పుడూ నా వెనక కూర్చుంటాడు. నేను రాసింది కాపీ కొట్టి పాసవ్వాలనుకుంటాడు. దీనికితోడు నేను దళితుడినని తెలిసింది. దీంతో మరింత కసితో నన్ను చావబాదేవాడు. మా తాత కేసు పెట్టడంతో ఈ ముగ్గురు వ్యక్తులు మా వద్దకు వచ్చి కేసు వాపసు తీసుకోమని బెదిరించారు. మార్చ్ లో ఫైనల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ కి వెళ్లడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు" అంటూ వాపోయాడు. ఈ వీడియో వెలుగు చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయారో... ఈ వాస్తవాలు తెలిసిన తరువాత కూడా నెటిజన్లు అంతే ఆశ్చర్యపోతున్నారు. ఈ అమానుషంపై పలువురు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.