: మరోసారి నవ్వులపాలయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారం!
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో భాగంగా ఒహాయోలో పంచిన ఓ కరపత్రంలో గురీందర్ సింగ్ ఖల్సా అనే ఓ సిక్కును ట్రంప్ తన ముస్లిం మద్దతుదారుడిగా ప్రచురించడం మరోసారి ఆయన పార్టీని నవ్వుల పాలు చేసింది. సిక్కు మతానికి చెందిన వ్యక్తిని ముస్లింగా భావించి ఈ కరపత్రాలను రూపొందించారు. కరపత్రంలో ఉన్న వ్యక్తి ఏ పార్టీకి అనుకూలం? అనే విషయాన్ని సైతం తెలుసుకోకుండా ఆయన ట్రంప్‌కే మద్దతుదారుగా కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది. ఇండియానా రాష్ట్రంలోని ఫిషర్స్ సిటీకి చెందిన గురీందర్ సింగ్ సిక్కు పొలిటికల్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారు. ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ముస్లింను కాదని తెలిపారు. అంతకన్నా ప్రధానంగా తాను ట్రంప్ మద్దతుదారుని అసలే కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు తెలియకుండా తన ఫొటోను ట్రంప్ పార్టీ నేతలు ఉపయోగించారని, దీనిపై తాను ఏమీ చేయలేనని అన్నారు. తాను మాత్రం ట్రంప్‌కు మద్దతు ఇవ్వనని చెప్పారు. తన ఫొటోను వాడుతున్నట్లు తనను ఎవరూ సంప్రదించలేదని వాపోయారు. తన ఫొటో ఉన్న కరపత్రాన్ని చూసి తాను షాక్ అయ్యానని, అమెరికా అంతటా ఈ కరపత్రాన్ని పంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.