: తన ఆస్తుల వివరాలను ప్రకటించాలా.. వద్దా.. అనేది జగన్ ఇష్టం!: నారా లోకేశ్
గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పేరే జపం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏమీ లేకే ప్రతిపక్షం తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోందని అన్నారు. తనకు, తన తండ్రికి కూడా విభేదాలు ఉన్నట్లు కొందరు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ఎప్పటికీ రావని ఉద్ఘాటించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చిచ్చుపెడుతున్నారని నారా లోకేశ్ విమర్శించారు. తన ఆస్తులు ప్రకటించాలా.. వద్దా.. అనేది జగన్ ఇష్టమని వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్ల నల్లధనం అంశాన్ని మొదట బయటకు తెచ్చింది తాము కాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేతలు భయపడి తమపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తాను అధికారిక సమావేశాల్లో పాల్గొనలేదని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలంగానే ఉంది. అక్కడ ప్రజాదరణ ఉందని వ్యాఖ్యానించారు.