: బీజేపీలో చేరిన మలయాళం సూపర్ స్టార్ సురేశ్ గోపి
మలయాళం సూపర్ స్టార్ సురేశ్ గోపీ బీజేపీలో చేరారు. గత ఏప్రిల్ లో కేంద్రం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మద్దతుతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టారు. ఒకానొక సమయంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతుందని భావించారు. అయితే, ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరలేదు. మరోవైపు, ఇటీవల కేరళలో జరిగిన ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. అయితే, అందుకు సురేశ్ గోపీ విముఖత చూపించారు. 57 ఏళ్ల సురేశ్ గోపి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా ఉన్నారు. అయితే, అవినీతిని అరికట్టడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకిగా మారారు. తాజాగా, బీజేపీలో అధికారికంగా చేరడం ద్వారా, రానున్న రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.