: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. విద్యార్థినులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు
అగ్రరాజ్యం అమెరికాను కాల్పుల ఘటనలు కలవరపెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలో మరోసారి కాల్పుల అలజడి చెలరేగింది. ఆ ప్రాంతంలోని వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల నుంచి కొందరు విద్యార్థులు తప్పించుకున్నారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు మాట్లాడుతూ... ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట దుండగులు ఈ చర్యలు పాల్పడినట్లు తెలిపారు. నల్లటి ముసుగులు వేసుకొని ఉన్న నలుగురు దుండగులు స్కూల్ విద్యార్థులపై కాల్పులు జరిపి, అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దుండగులు విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు చేసినట్లు వారు పేర్కొన్నారు. గాయాలపాలయిన విద్యార్థులకి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.