: ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన తమిళనాడు మంత్రివర్గ సమావేశం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గతనెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ రోజు తమిళనాడు మంత్రివర్గం సమావేశమైంది. పన్నీర్ సెల్వంకు తమిళనాడు ముఖ్యమంత్రి శాఖల బదలాయింపు తరువాత మొదటిసారి ఆయన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. అందులో ప్రధానంగా కావేరీ జలాల వివాదం, తమిళనాడు శాసనసభ ఉప ఎన్నికల అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఉప ఎన్నికలకు అన్నాడీఎంకే తరఫున అభ్యర్థుల ఖరారుపై పన్నీర్ సెల్వం మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.