: పెళ్లి పేరుతో 50 మంది మహిళలను మోసం చేసిన ప్రబుద్ధుడు.. అప్పుల పేరుతో డబ్బుల వసూలు.. తర్వాత పరార్!
మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకుని పెళ్లి పేరుతో మహిళలను మోసం చేసిన ఓ ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. ఢిల్లీకి చెందిన మనీష్ గుప్తా మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా తనను తాను విడాకులు తీసుకున్న యువకుడిగా చెప్పుకునేవాడు. తన దారిలోకి వచ్చిన అమ్మాయిలతో పెళ్లి తేదీ కూడా కుదుర్చుకునేవాడు. తర్వాత కొన్ని అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు డబ్బులు కావాలని అడిగి తీసుకునే వాడు. అనంతరం అడ్రస్ లేకుండా పోయేవాడు. తాజాగా గుప్తా వలలో ఓ వైద్యురాలు కూడా పడింది. అతడి చేతిలో ఘోరంగా మోసపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించడంతో మోసగాడి లీలలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఐపీ అడ్రస్ ద్వారా అడ్రస్ తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ మలింద్ దుంబెరె తెలిపారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను మాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్ పెట్టానని, దీంతో గుప్తా తనను సంప్రదించాడని వైద్యురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసినట్టు తన బయోడేటాలో పేర్కొన్న గుప్తా తన బిజినెస్ టర్నోవర్ కోటి రూపాయలని అందులో పేర్కొన్నాడని తెలిపారు. వివిధ కారణాలు చెబుతూ తన నుంచి ఓసారి రూ.50వేలు, మరోసారి రూ.25 వేలు, ఇంకోసారి రూ.75వేలు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు. కాగా గుప్తా ఇప్పటి వరకు పెళ్లి పేరుతో 50 మంది మహిళలను మోసం చేసినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.