: నేను గెలిస్తే ప్రమాణ స్వీకారానికి ముందే పుతిన్‌ను కలుస్తా.. స్పష్టం చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను కనుక గెలిస్తే ప్రమాణ స్వీకారానికి ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే పుతిన్‌కు ఎప్పుడూ గౌరవం లేదన్నారు. ఒబామా దేశాక్షుడిగా ఎన్నికయ్యాక విదేశాంగ విధానానికి దూరం జరిగారని ట్రంప్ విమర్శించారు. విదేశాంగ విధానానికి దూరమైన ఏకైక అమెరికా అధ్యక్షుడు ఒబామానేనని దుయ్యబట్టారు. కాగా గతంలో మహిళలపై ట్రంప్ చేసిన అసభ్య కామెంట్ల వీడియోలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌తో జరిగిన రెండు డిబేట్లలోనూ ఆయన వెనకబడిపోవడం, తాజాగా బయటపడుతున్న వీడియోలతో ఆయన ప్రతిభ మసక బారింది. దీంతో మొదట్లో హిల్లరీ కంటే పైన ఉన్న ట్రంప్ క్రమంగా వెనకబడిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు ఏకమవుతున్నారు. నిన్నమొన్నటి వరకు గెలుపుపై ధీమాగా ఉన్న ట్రంప్‌కు ఇటీవలి పరిణామాలు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో గెలుపై ఆశ కోల్పోయిన ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.