: 6.25 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన ఎస్బీఐ.. అనుమానాస్పద లావాదేవీలే కారణం
మూడో పార్టీ ఏటీఎం యంత్రాల ద్వారా పలు అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ ఖాతాదారులకు చెందిన 6.25 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ విషయం తెలియని ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. కార్డు బ్లాక్ చేసిన సంగతిని ఎస్ఎంఎస్, ఈమెయిళ్ల ద్వారా ఖాతాదారులకు తెలియజేస్తున్నట్టు ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. కార్డు బ్లాక్ అయినవారు దగ్గరల్లోని బ్రాంచ్‌కు వెళ్లి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా పలు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంతో కార్డులను బ్లాక్ చేశామని అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పద లావాదేవీల బెడద ఒక్క ఎస్బీఐకే లేదని, ప్రైవేటు, విదేశీ బ్యాంకు కార్డులకు కూడా ప్రమాదం పొంచి ఉందని వివరించారు. నెల రోజుల క్రితం ఖాతాదారుల సమాచారం హ్యాక్ అయినట్టు గుర్తించే కార్డులను బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు. కార్డు బ్లాక్ కానివారు వెంటనే తమ పిన్ నంబర్లను మార్చుకోవాలని సూచించారు.