: రహదారుల నిర్మాణం.. యావత్ దేశానికి ఆదర్శం కావాలి.. అధికారులతో సీఎం కేసీఆర్
ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్‌రోడ్డును రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. దాదాపు 330 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ రహదారులు, భవనాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శులు పి.నర్సింగరావు, సునీల్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. రహదారులపై పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించి భవిష్యత్తుకు పనికొచ్చేలా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి రాష్ట్రం అవలంబించే విధానం మొత్తం దేశానికే ఆదర్శం కావాలన్నారు. రోడ్లు త్వరగా పాడవకుండా ఉండేందుకు విదేశీ విధానాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఐరోపా, అమెరికా దేశాల్లోని రోడ్లు బాగుంటాయని సీఎం గుర్తు చేశారు.