: గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగిన అధికార పార్టీ నేతలు, ఏఎస్పీ మద్దిపాటి.. బట్టబయలైన వ్యవహారం
గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగిన బడాబాబుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ‘సిట్’ దర్యాప్తులో దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తరతమ భేదం లేకుండా రాజకీయ పార్టీల నేతల నుంచి పోలీసుల వరకు నయీంతో అంటకాగారు. దొరికింది దొరికినట్టు దోచుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు, అప్పట్లో కాంగ్రెస్, ప్రస్తుతం టీఆర్ఎస్ నేత అయిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, సీఐ వెంకటయ్య తదితర పోలీసు అధికారులు గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ప్రజల భూములను కబ్జా చేసి పప్పుబెల్లాల్లా పంచేసుకున్నారు. వారి బినామీలే స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం విశేషం. సిట్ దర్యాప్తులో బినామీలు అప్పట్లో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. నయీం బినామీ వెలగపూడి శివరాం.. డీఎస్పీ మలినేని శ్రీనివాసరావు, నయీంకు మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టాడు. గంగసాని రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, మధుకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డితో నయీంకు సంబంధాలు ఉన్నట్టు వెల్లడించాడు. నర్సింహారెడ్డి అనే నయీం మరో బినామీ పోలీసు అధికారి మద్దిపాటి శ్రీనివాసరావు పేరును ప్రస్తావించాడు. చింతల వెంకటేశ్వరరెడ్డికి రెండెకరాలు ఇచ్చినట్టు పాశం శ్రీనివాస్ దర్యాప్తులో వెల్లడించాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ వేరే వ్యక్తి పేరుతో ఉండడంతో ఆ బినామీ ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మధుకర్ రెడ్డే ఆయన బినామీ అయి ఉండవచ్చని అధికారులు ఆయనను విచారించారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని 154 ఎకరాల కబ్జా కేసును విచారిస్తున్న భువనగిరి కోర్టుకు సిట్ అధికారులు సోమవారం నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ద్వారానే ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి.